ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మేళతాళాలు.. మంగళ వాద్యాలతో భక్తులు దుర్గమ్మ కొండకు తరలివస్తున్నారు. సకుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. గురువారం సుమారు 40కి పైగా భక్త బృందాలు, 1200 మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారెను సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలు, భక్తులకు దేవస్థానం సకల సదుపాయాలను కల్పిస్తోంది. ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. మహామండపం ఆరు, ఏడు అంతస్తుల్లో అమ్మవారికి సమర్పించిన పసుపు, కుంకుమ, గాజులు, చలి మిడి, మిఠాయిలను మహిళలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సారె సమర్పించిన భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాలతో పాటు ఉచిత ప్రసాదాలను దేవస్థానం అందించింది.
10వ తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు?
ఆషాఢం సారె, వారాంతం, శాకంబరీదేవి ఉత్స వాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలను ఈఓ నిలిపివేశారు. తాజాగా పదో తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేయాలనే ఆలోచన చేయడం గమనార్హం.
మేళతాళాలతో దుర్గమ్మకు సారె