
ఎంఎంసీలో లెక్కలేనితనం
● మచిలీపట్నం నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగంలో అక్రమాలు ● కాంట్రాక్టర్ల నుంచి మినహాయించిన మొత్తాలను ఆయా శాఖలకు జమ చేయని వైనం ● బదిలీపై వచ్చిన కొత్త జేఏఓకు చార్జి అప్పగించని ఇన్‌చార్జి అకౌంటెంట్ ● లోపాలు బయటపడతాయని కార్యాలయంలో కనిపించని ఇన్‌చార్జి ఏఓ!
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయం అకౌంట్స్ విభాగం అవినీతికి అడ్డాగా మారిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కమిషనర్ కనుసైగల్లోనే ఈ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేశారనేందుకు ఇక్కడ చోటు చేసుకున్న ఘటనలు బలం చేకూర్చుతున్నాయి. అకౌంటెంట్‌గా అనుభం లేని, అర్హత లేని జూని యర్ అసిస్టెంట్ మోహనగోపాల్‌ను ఆ సీట్లో నియమించి రూ.లక్షల ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా చెల్లింపులు చేశారనేది ప్రధాన విమర్శ. కమిషనర్‌తో పాటు ఇంజినీర్లు, అకౌంట్ ఆఫీసర్ సైతం అడ్వాన్స్‌ల రూపంలో రూ.లక్షల్లో నిధుల డ్రా చేసుకోవటం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కూటమి పెద్దల ఆదేశాలతో ఏడాది కాలంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం అత్యవసరం పేరుతో కౌన్సిల్ ఆమోదం లేకుండా బిల్లులు చెల్లించడం గమనార్హం.
చార్జి అప్పగించని ఇన్‌చార్జ్ అకౌంటెంట్
పెడన మునిసిపాలిటీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసిన జేఏఓ మల్లేశ్వరరావు నెలన్నర క్రితం ఎంఎంసీకి బదిలీపై వచ్చారు. దీంతో ఇక్కడ ఇన్‌చార్జ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న మోహనగోపాల్‌ను రెవెన్యూ విభాగానికి కమిషనర్ బదిలీ చేశారు. అయితే జేఏఓకు అకౌంట్స్‌కు సంబంధించిన ఫైల్‌తో చార్జ్‌ని అప్పగించాల్సిన గోపాల్ నూతన ఏఓకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. చార్జ్ అప్పగిస్తే ఈ అక్రమాల బాగోతం బయటపడుతాయనే అప్పగించటంలేదనే వాదనలు బాహాటంగానే వినవస్తున్నాయి. అందువల్లే గోపాల్ కార్యాలయంలో కూడా కనిపించడంలేదని సిబ్బంది సైతం పేర్కొంటున్నారు. చార్జ్ అప్పగించడంలో జాప్యం చేస్తున్నా కమిషనర్ కూడా మిన్నకుండి పోవటం విమర్శలకు తావిస్తోంది.
సకాలంలో జమకాని జీఎస్టీ, ఐటీ నిధులు
పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన అనంతరం జీఎస్‌టీ రెండు శాతం, ఐటీ ఒక శాతం నిధులను ఎంఎంసీ మినహాయిస్తుంది. ఈ మొత్తాన్ని సకాలంలో ఆయా శాఖలకు ఏఓ జమ చేయాలి. కానీ ఇక్కడ అలా జరగకపోవటంతో ఆయా శాఖలు సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ వసూళ్లకు పూనుకుంటున్నాయి. ఆయా శాఖలకు కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉన్నా ఏఓ ఇటీవల రూ.5 లక్షలను నగరంలోని ఓ అకౌంటెంట్ పేరుతో జమ చేయటం అనుమానాలకు తావిస్తోంది. నగరపాలక సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఆడిట్, విజిలెన్స్, ఏసీబీ శాఖల అధికారులు కన్నెత్తి చూడకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.