
బీమా.. రైతుకు భారం
కృష్ణాజిల్లాలో సాగు విస్తీర్ణం : 1.79 లక్షల హెక్టార్లు
పసుపు సాగు : 2,200 హెక్టార్లు
కంకిపాడు: రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించింది. రైతులపై భారం మోపుతోంది. ప్రీమియం సొమ్ము చెల్లిస్తేనే పంటల బీమా వర్తించేలా మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. కూటమి అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలపై కోట్లాది రూపాయల ప్రీమియం భారం పడుతోంది. మరోవైపు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అందుతుందో తెలియక, సాగుకు పెట్టుబడుల కోసం రైతులు దిగులు చెందుతుంటే ప్రీమియం సొమ్ము చెల్లించాలంటూ అధికారులు తెస్తున్న ఒత్తిడి తలకు మించిన భారంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు.
4.47 లక్షల ఎకరాల్లో సాగుభూమి
కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 4.47 ఎకరాల్లో (1.78 లక్షల హెక్టార్లు) సాగు భూమి ఉంది. ప్రధానంగా వరి, చెరకు, పసుపు, పత్తి, వేరుశనగ, కూరగాయలు, కంద కూరగాయలు సాగులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకు ఉపక్రమించారు. జిల్లాలో వ్యవ సాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు.
పంటల బీమా నుంచి తప్పుకున్న కూటమి సర్కార్
కూటమి సర్కార్ పంటల బీమా నుంచి కూడా తప్పుకుంది. రైతు నెత్తిన భారాన్ని మోపి చోద్యం చూస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, పసుపు పంటలను ఎంపిక చేశారు. జిల్లాలో 1.68 లక్షల హెక్టార్లు (4.21 లక్షల ఎకరాలు) సాగు జరుగుతుంది. వరిని గ్రామం యూనిట్ కింద ఎకరాకు రైతు వాటాగా రూ.830 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. పసుపు పంటకు జిల్లా యూనిట్‌గా బీమా వర్తింపజేయనున్నారు. జిల్లాలో 5,500 ఎకరాల్లో పసుపు సాగు జరగనుంది. దీనికి ఎకరానికి రూ.1,100 ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాలో రైతులపై భారం
ఈ రెండు పంటలకు వర్తింపజేయనున్న బీమాకు రైతులపై రూ 35.56 కోట్లు మేరకు భారం పడ నుంది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 15వ తేదీ కాగా, పసుపు పంటకు జులై 31 ఆఖరిగడువుగా నిర్దేశించారు.
ఎప్పుడు అందుతుందో..
అప్పుడే రెండో ఏడాదిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. అధికారులు ఓ వైపు అర్హుల జాబితాను రూపొందించే పనిలోనే ఉన్నారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ సొమ్ము ఎప్పటికి రైతు ఖాతాలకు చేరుతుందో తెలీని దిక్కుతోచని స్థితి. ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు సమకూర్చుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించాల్సిందేనని సర్కారు తేల్చి చెప్పటం, ఉత్తర్వులు జారీ చేయటం పట్ల అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రీమియం చెల్లించాలి కృష్ణా జిల్లాలో వరి, పసుపు పంటలకు బీమా జిల్లా రైతులపై రూ.35.56 కోట్లు భారం
వరి సాగు : 1.68 లక్షల హెక్టార్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
నాడు వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత బీమా
ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలుకు పాలకులు చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడులకు నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక సాయం అందించడం, వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన నష్టంతో దిగుబడులు తగ్గితే బీమా పరిహారం చెల్లించడం ప్రధాన మంత్రి ఫసల్ బీమా ఉద్దేశం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ బీమాను ప్రభుత్వమే భరించింది. ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంది.
అన్నదాత సుఖీభవ ఏదీ?
రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్న ప్రధాన హామీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలన చేపట్టి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకూ రైతు సంక్షేమానికి బాటలు వేయలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందించాల్సి ఉంది. తొలి ఏడాది జిల్లాలో రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు.

బీమా.. రైతుకు భారం

బీమా.. రైతుకు భారం