
ఇంటింటికీ తెలియజేయండి
చంద్రబాబు మోసాలను
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలని ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని మారుతీనగర్ రామాలయం వీధిలోని లయన్స్ భవన్‌లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథి వేణుగోపాల్‌రెడ్డి క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడని.. సూపర్‌సిక్స్ పథకాలను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు మాత్రం ఓడిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన విలువ రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి తాము మోసపోయామని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకుల ఫోన్లను కూడా అధికారులు, పోలీసులు లిఫ్ట్ చేసేవారు కాదని చెప్పారు.
మార్పు కనిపిస్తోంది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలు, పరామర్శలకు వస్తున్న ప్రజాధరణను చూసి అధికారుల్లో సైతం మార్పు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు ఫోన్లకు స్పందించడమే కాకుండా గౌరవంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి చేస్తుండటంతో రానున్న రోజుల్లో కూటమిలోని నాయకులు బయట తిరగలేని పరిస్థితులు వస్తాయన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింతగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వారితో నేతలు, కార్యకర్తలు మాట్లాడాలన్నారు.
విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించం..
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తాము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్థి పేరుతో విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో నగరాభివృద్ధి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.600 కోట్లతో నగరాభివృద్ధి చేశామని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కంటే తాము అధికారంలోకి వస్తే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి బాండ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇలా ఏ పథకాన్నీ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధినే తాను చేశానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీని వదిలి వెళ్లిన నాయకులంతా మళ్లీ వచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని అవినాష్ పేర్కొన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు అడపా శేషు, పుప్పాల కుమారి, రామిరెడ్డి, అంబేడ్కర్, అమర్‌నాథ్, నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తెలియజేయండి