
కొండచిలువ హతం
మైలవరం: మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో పాడుబడిన బావి వద్ద పేరుకుపోయిన చెత్తలో ఉన్న కొండచిలువను గమనించిన గ్రామస్తులు మంగళవారం కర్రలు, కత్తులతో హతమార్చారు. గ్రామానికి చెందిన రైతు వేల్పులకొండ ప్రసాద్‌కు పాము కన్పించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో యువకులు పరుగున వెళ్లి దానిని హతమార్చారు. కొండ చిలువ సుమారు 10 అడుగుల పొడవు, 15కిలోలు బరువు ఉందని యువకులు తెలిపారు. కాగా జంగాలపల్లి గ్రామం నుంచి బయటికి రావాలంటే దారి మార్గం సరిగా ఉండకపోగా, కొద్దిపాటి వర్షానికి రహదారికి గండ్లు పడి కనీసం నడవడానికి కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గృహావసరాలకు బావి నీటిని వాడుకుంటూ ఉంటారని, అదే విధంగా అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు. బావి పాడైపోయి ఉండటంతో గ్రామస్తులు చెత్తా చెదారం తీసుకువచ్చి అక్కడే పడేస్తున్నారని దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన పాములు తిరుగుతూ భయానక వాతావరణం నెలకొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగునకు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.