
‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’పై సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియ్ సింగ్ బృందానికి కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు, సమస్యలు తెలియజేయాలని కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను కోరారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాకు అవసరమైన స్టోరేజ్ ట్యాంకులు ప్రధాన సమస్యగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా పేరుకుపోయిన చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు పెద్ద మొత్తంలో భారీ వాహనాలు, వాటి నిర్వహణకు నిధులు అవసరమన్నారు. తీర ప్రాంతంలోని నేలల ప్రభావం వల్ల ఇళ్ల నిర్మాణ పునాది పటిష్టంగా నిర్మించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉందని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలకు ఒక యూనిట్‌కు అందించే రూ.1.8 లక్షల నగదును పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల్లో పర్యటన..
కేంద్ర బృందం ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి మురుగుకాల్వలు, పారిశుద్ధ్య పనులు, ఇంటింటికీ తాగునీరు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త నిర్వహణ, కంపోస్టు ఎరువు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, వాటి ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ రోజ్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్ యాదవ్, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటరావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పరిస్థితులు పరిశీలించిన కేంద్ర బృందం