అన్నీ మావే.. అంతా మాకే! | - | Sakshi
Sakshi News home page

అన్నీ మావే.. అంతా మాకే!

Jul 3 2025 7:31 AM | Updated on Jul 3 2025 7:31 AM

అన్నీ మావే.. అంతా మాకే!

అన్నీ మావే.. అంతా మాకే!

దోపిడీకి కాదేదీ అనర్హం అన్న చందంగా తయారైంది పామర్రు నియోజకవర్గం పరిస్థితి. మట్టి, ఇసుక, మద్యం, రేషన్‌ బియ్యం ఇలా దేనిని వదలకుండా అక్రమార్జనకు తెరతీశారు. విచ్చల విడిగా జూద క్రీడలు నిర్వహిస్తూ రూ. లక్షల్లో దండుకుంటున్నారు. మండలానికో కలెక్షన్‌ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకొని.. నియోజకవర్గ ముఖ్యనేత దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రూ. కోట్లను కొల్లగొట్టినట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. – సాక్షి ప్రతినిధి, విజయవాడ

మట్టిని కొల్లగొట్టేస్తున్నారు..

మొవ్వ మండలంలో కోసూరు, మొవ్వ, అయ్యంకి, పెద్దముత్తేవి, నిడుమోలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేసి, రూ.10 కోట్లకు పైగా దండుకొన్నారు. పామర్రు మండలం పసుమర్రులో రూ.3కోట్లు, రిమ్మనపూడి, నిబానపూడి, కొమరవోలు, నిమ్మకూరులో రూ.కోటి విలువైన మట్టి దోపిడీ చేశారు. పెదపారుపూడి మండలంలోని వెంట ప్రగడలో ఓ ప్రైవేటు స్కూలుకు రూ.3కోట్ల విలువైన మట్టిని తోలారు. పమిడిముక్కల మండలంలో గోపవానిపాలెంలో పెద్ద ఎత్తున అక్రమ మట్టితోలకాలు చేశారు. ఇవన్నీ ఆయా మండల పచ్చ నేతల కనుసన్నల్లోనే జరిగాయని.. ఇందులో నియోజకవర్గ ముఖ్యనేతకు వాటాలున్నట్లు తెలుస్తోంది.

రేషన్‌పై పక్కా డీల్‌..

టీడీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్‌ బియ్యం దందాను పామర్రులోని ఓ రైస్‌ మిల్లర్‌కు అప్పజెప్పారు. ఇప్పుడు రూటు మార్చి, నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లే బియ్యం కిలోకు రూ.3 చొప్పున డీల్‌ కుదుర్చుకొని, పెనమలూరు నియోజకవర్గానికి చెంది న వ్యక్తికి దందా వ్యవహారాన్ని అప్పజెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కన నెలకు రూ.50లక్షల వరకు ముఖ్యనేత ఖాతాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఊరూరా ‘బెల్ట్‌’..

నియోజకవర్గంలోని 106 గ్రామాల్లో, జనాభాను బట్టి బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేశారు. ఈ బెల్ట్‌ షాపులు గ్రామాల్లో వేలం నిర్వహించి అప్పజెప్పారు. ప్రతి బెల్ట్‌ షాపు నుంచి అక్కడ జరిగే వ్యాపారాన్ని బట్టి నెలకు రూ.50లక్షల వరకూ మామూళ్లు వసూలు చేస్తున్నారు.

చిరు ఉద్యోగులపై వేధింపులు..

గ్రామాల్లో బుక్‌ కీపర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇలా చిరు ఉద్యోగులపైనా పచ్చనేతలు చిన్న, చిన్న ఫిర్యాదులు చేసి, వారిని తొలగించి, ఆ స్థానంలో డబ్బులు తీసుకొని, వేరే వారిని నియమిస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో పచ్చనేతలు పనులకు వెళ్లకున్నా మస్టర్‌ వేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య తగాదా ఏర్పడి ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఓ వర్గం వారు కరపత్రాలు వేసి పంచిన ఘటన పెదపారుపూడిలో చోటు చేసుకొంది.

తప్పుడు కేసులు..

వైఎస్సార్‌ సీపీ నేతలపై తప్పుడు కేసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది, దీంతో ఓ వర్గం వారు టీడీపీ నాయకుడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ టీడీపీ నాయకుడు ఫ్వార్డర్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌కు సంబంధించి, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం.

విచ్చలవిడిగా జూదం ఏరులై పారుతున్న మద్యం యథేచ్ఛగా రేషన్‌ దందా అడ్డూఅదుపులేని ఇసుక, మట్టి అక్రమ రవాణా మండలానికో ఏజెంటును పెట్టి మరీ వసూళ్లు అంతా నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే..

పామర్రులో హద్దులు దాటుతున్న దోపిడీ పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement