
నిలబడదాం.. నిలదీద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకు వచ్చేలా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల ముందు బాబు, పవన్‌లు బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీసేలా ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం బుధవారం విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం దానిని స్కాన్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు, ఇంటింటికీ ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ ఇచ్చిన బాండ్ల గురించి వివరించారు. ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని అమలు చేశారనే విషయాలను ప్రతి ఇంటికీ వెళ్లి ఎలా అవగాహన కలిగించాలని పార్టీ ప్రతినిధులకు వివరించారు.
కక్షే లక్ష్యం..
అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా సంక్షేమ పథకాల అమలును విస్మరించి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ణణం, మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును ఎవరూ నమ్మరని.. బాండ్లు ఇచ్చి మరీ నమ్మించారని, కానీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. వాటిపై ప్రజలు నిలదీసేలా చైతన్యం తీసుకు వద్దామన్నారు.
● మాజీ మంత్రి, పార్టీ మైలవరం ఇన్‌చార్జి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాలతో గద్దెను ఎక్కారన్నారు. పార్టీ నాయకులందరం ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. మాట ఇస్తే తప్పే కుటుంబం కాదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు.
● మాజీ మంత్రి, పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది కాలంగా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. వైఎస్ జగన్ ఒక్క పిలుపు ఇస్తే లక్షలాదిగా ప్రజలు వస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు.
● మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అబద్దాల పుట్ట అన్నారు. జగన్ సుపరిపాలన, చంద్రబాబు మోసపు పాలన గురించి ప్రజలకు తెలియజేద్దామన్నారు.
● మాజీ ఎమ్మెల్యే, పార్టీ పామర్రు ఇన్‌చార్జి కై లే అనిల్‌కుమార్ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలకు కేరాఫ్ చంద్రబాబు..
పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం మోసాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్లగట్ల స్వామిదాసు, మొండితోక జగన్మోహనరావు, సింహాద్రి రమేష్‌లతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము ప్రభుత్వ తీరును విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్‌లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
ఇంటింటికీ ఇచ్చిన బాండ్లపై ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి ఆగస్టు 4 వరకూ గ్రామస్థాయిలో కార్యక్రమం వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్‌చార్జి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలో వైఎస్సార్ సీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం
చంద్రబాబు అంటే మోసం..
చంద్రబాబు అంటే మోసం గ్యారంటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ నాయకత్వంలో మనమంతా మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

నిలబడదాం.. నిలదీద్దాం

నిలబడదాం.. నిలదీద్దాం