
కనులపండువగా కల్యాణం
గుడ్లవల్లేరు: డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని మెయిల్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనులపండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు, బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ఉన్నారు.
వ్యక్తిపై గొడ్డలితో దాడి
మైలవరం: రెడ్డిగూడెం మండలం బూరుగగూడెంలో భూ వివాదం శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బూరుగుగూడెంలో మట్టకొయ్య శ్రీను(55) తండ్రి వెంకయ్య కు కె.మనోజ్, అతని తండ్రి జయరాజు కుబుంబ సభ్యులకు ఇంటి సరిహద్దు వివాదముంది. దీంతో మనోజ్ కుటుంబసభ్యులు మట్టకొయ్య శ్రీను ఇంటిపై దాడికి దిగారు. రెండువైపులా గొడవలు పెరగగా మనోజ్ గొడ్డలితో శ్రీను తలపై బలంగా నరికాడు. దీంతో శ్రీను ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీను కుటుంబం భయాందోళనకు గురై హుటాహుటిన రెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గతేడాది నుంచి మమ్మల్ని చంపేందుకు అనేక సార్లు ప్రయత్నించారని, ఈ రోజు తెగించి గొడ్డలితో దాడి చేశారన్నారు. తమకు మనోజ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.