
బలమైన హిందువులే దేశాన్ని రక్షిస్తారు
● హనుమాన్ శోభాయాత్రలో రాధామనోహర్‌దాస్
పెడన: బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరని, ఆ విధంగా హిందువులు మారి ప్రతిజ్ఞ చేయాలని అభయ హిందూ సేన ఫౌండర్, హిందూ ప్రచార రాష్ట్ర కార్యదర్శి రాధా మనోహర్‌దాస్ అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం పెడన నియోజకవర్గం పోసినవారిపాలెం పంచాయతీ పిండివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్రను హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధామనోహర్‌దాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
హిందువులగానే ఉండాలి..
తొలుత ఆయన హిందువులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. భూమ్మీద మారాల్సింది హిందూవులేనని, ప్రశ్నించాల్సింది, మాట్లాడాల్సింది, ఏమి చేయకపోయినా నశించిపోయేది కూడా హిందూవులేనని స్పష్టం చేశారు. ఇంటి దొంగల వల్ల దేశం సర్వనాశనం అవుతుందని దుయ్యబెట్టారు. తన టార్గెట్ ఇతర మతస్తులు కాదని, హిందువులు మైనార్టీలుగా మారితే గుళ్లు, దేవాలయాలుండవన్నారు. హిందువులు హిందువులగానే ఉండాలని ఆకాంక్షించారు. మన దేశం చాలా గొప్పదని, రామాయణం, భాగవతం, హిందూత్వం వల్ల మన దేశం చాలా గొప్పగా నిలిచిందని, దానిని కొందరు సెక్యూలరీజం వారు నాశనం చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఆయన శోభయాత్రాలో పాల్గొంటున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. హనుమంతుని చిత్రంతో ఉన్న కాషాయ జెండాను ఊపిశోభాయాత్రను ప్రారంభించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. గూడూరు మండలం పోసినవారిపాలెం, సురాదాయిపేట, పెడన పట్టణంలోని బ్రహ్మపురం, దక్షిణ తెలుగుపాలెం, ప్రధాన రహదారి వెంబడి మీదుగా తోటమూల, ఆగస్తేశ్వరస్వామి ఆలయం, బస్టాండు సెంటరులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని యాత్రను ముగించారు. హిందూ చైతన్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెండ్ల కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.