
బుడమేరు కాంక్రీట్ పనులకు భూమిపూజ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు వద్ద పడిన గండ్లకు శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం భూమిపూజ చేశారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ సుమారు రూ.28 కోట్ల అంచనాతో గండ్లు పడిన మూడు ప్రాంతాల్లో 500 మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. గతంలో బుడమేరు వరద ప్రవాహంతో విజయవాడ నగరం వరదతో ముంచెత్తిన విషయం తెలిసిందే అన్నారు. భవిష్యత్‌లో అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. జూన్ 10లోపు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని నిర్మాణ ఏజెన్సీ సంస్థను కోరారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.