
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో అప్రమత్తం
చిలకలపూడి(మచిలీపట్నం): వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన కరపత్రాలను ఆమె సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులకు డీ హైడ్రేషన్, సాధారణంగా వచ్చే వ్యాధులతో సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమన్నారు. వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ప్రతి రోజూ నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. తేలిక పాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. మితంగా భోజనం చేయాలన్నారు. ఎండల్లో బయట తిరగ కూడదని సూచించారు.
అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించండి
అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించడానికి చర్యలు చేపట్టాలని గీతాంజలిశర్మ అన్నారు. ఈ వ్యాధి సోకకుండా సబ్బునీటితో చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలన్నారు. చిన్న పిల్లలకు మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలను మాత్రమే తాగించాలన్నారు. కార్యక్రమాల్లో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఎస్.షర్మిష్ట, ఆర్డీవో కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ