
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన రెడ్డిగూడెం మండల పరిధి కుదప గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్లమందల వెంకయ్య(60)కి అదే గ్రామానికి చెందిన బేతు నాగేసు, ఈదురుపాటి చిన్నబ్బాయికి గత కొన్ని రోజులుగా ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో వెంకయ్యపై నాగేసు, చిన్నబ్బాయి రెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ నిమిత్తం వెంకయ్యను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. తాను ఎవ్వరి దగ్గర డబ్బులు అప్పు తీసుకోలేదని తాను స్టేషన్‌కు రావాల్సి అవసరం లేదని వెంకయ్య పోలీసులకు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వెంకయ్య తిరిగి ఇంటికి రాలేదు. ఈ సమయంలోనే రెడ్డిగూడెం ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్స్ సైతం వెంకయ్య కోసం ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం దాటినప్పటికీ వెంకయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని పొలంలోకి వెళ్లి చూడగా వెంకయ్య శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. వెంకయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు వెంకయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.