అంతటా అస్తవ్యస్తం..
Æ ఈడుపుగల్లులో చెట్లు కూలటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న మున్నా అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక సంస్థల పర్యవేక్షణలో పొక్లెయిన్‌లు, కటింగ్‌యంత్రాలతో చెట్లను నరికించి రాకపోకలను పునరుద్ధరించారు.
Æ పెడన, పెనమలూరు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లపై చెట్లు కూలటంతో సుమారు 40 విద్యుత్‌స్తంభాలు నేల కూలాయి. ఆరు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి.
Æ కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు, గుడివాడ, బంటుమిల్లి, పెడన పరిసరాల్లోని ప్రధాన రహదారులు వెంబడి వర్షపునీరు నిలిచిపోయింది.
Æ పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో రోడ్డు మార్జిన్‌లలో నిర్మించిన పాకలు నేలమట్టం అయ్యాయి.
Æ కంకిపాడు, ఉయ్యూరు, గొడవర్రు రోడ్డు, ఈడుపుగల్లు పరిసరాల్లో భారీ వృక్షాలు నేలకూలటంతో రొయ్యూరు–గొడవర్రు, ఈడుపుగల్లు–ఉప్పలూరు, కంకిపాడు–విజయవాడ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
కంకిపాడు: గాలి వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసిన మొక్కజొన్న, ధాన్యం వర్షానికి తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి నేలరాలింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకూ వాతావరణం సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
అకాల వర్షం.. అన్నదాతకు ఎంతో కష్టం..
జిల్లా వ్యాప్తంగా 12,875 ఎకరాల్లో రబీ సీజన్‌లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 11875 ఎకరాల్లో, మామిడి గన్నవరం పరిసర ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు జరిగింది. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోత కోసిన ధాన్యం కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసి ఉంచారు. గోనె సంచులు, రవాణా వాహనాల కొరత కారణంగా గడిచిన వారం రోజులుగా ధాన్యం మిల్లులకు తరలకుండా నిలిచిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో రాశులు, బస్తాల కెత్తి న ధాన్యం వర్షానికి తడిసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బస్తాల కెత్తిన ధాన్యం తిరిగి ఆరబోసి కాటా వేసేందుకు ఎకరాకు రూ. 5 వేలు పెట్టుబడి అదనంగా అవుతుందని, రాశుల మీద ఉన్న ధాన్యం పూర్తిగా ఆరబోసేందుకు ఎకరాకు రూ. 3వేలు పెట్టుబడులు అవుతాయని ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర, మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని ఆశించి కల్లాల్లో మొక్కజొన్న నిల్వ చేసుకున్న రైతులకు వర్షం నష్టం మిగిల్చింది. జిల్లాలో పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. తేమ కారణంగా మొక్కజొన్న గింజలు నలుపు రంగులోకి మారి ధర ఎంతకు పలుకుతుందో కూడా అర్థం కావటం లేదని ఆందోళన చెందుతున్నారు. గన్నవరం పరిసరాల్లోని సూరంపల్లి, గొల్లనపల్లి, మెట్టపల్లి, గోపువారిగూడెం, మాదల వారిగూడెం ప్రాంతాల్లో సాగులో ఉన్న 10 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న బంగినపల్లి, రసాలు నేలరాలి రైతులు నష్టపోయారు.
స్విమ్మింగ్ పూల్ ధ్వంసం..
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో నడుస్తున్న ఈడుపుగల్లు స్విమ్మింగ్ పూల్ భారీ వర్షం ధాటికి ధ్వంసమైంది. ప్రధాన గేటు, ప్రహరీపై ఏర్పాటుచేసిన రేకులు, వాటర్ ట్యాంకులు దెబ్బతిన్నాయి. రూ. 5 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు డీఎస్‌డీఓ కార్యాలయ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. మరమ్మతులు పూర్తయ్యేందుకు వారం సమయం పడుతుందని, అప్పటి వరకూ క్రీడాకారులు శిక్షణకు రావొద్దని అధికారులు సూచించారు.
370 సారలు కల్లంలో ఉన్నాయి..
నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశా. వారం క్రితం 10 ఎకరాల్లో పంటను మిల్లుకు తోలాం. ఇంకా ఐదెకరాలకు చెందిన 370 సారలు కల్లంలో కాటా వేసి ఉంచా. వర్షంతో బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు పెట్టుబడి అయ్యింది. బస్తాలు తడిసిన కారణంగా ఆరబోతకు ఎకరాకు రూ. 5 వేలు అదనపు ఖర్చు అవుతుంది. లాభం మాట అటుంచితే పంటను కాపాడుకోవటానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది.
– లుక్కా వెంకటేశ్వరరావు, రైతు, రొయ్యూరు
జిల్లాలో గాలి వాన బీభత్సం ఉరుములు, మెరుపులతో అకాల వర్షం తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మొక్కజొన్న పల్లపు ప్రాంతాలు జలమయం నేలకూలిన భారీ వృక్షాలు
మండుటెండల్లో మహా వర్షం
కష్టం అంతా తడిసిపోయింది..
మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పూర్తిగా పంట ఎండింది. నిన్నటి దాకా రూ. 2వేలకు అడిగారు. ఇంకా ఎండితే రేటు పెరుగుతుందని ఆశించా. వర్షం వచ్చి పంటను పూర్తిగా తడిపేసింది. వర్షం కారణంగా పంట నలుపెక్కుతుంది. రేటు కూడా బాగా తగ్గిస్తారనే భయం వేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– గోపి, కౌలురైతు, గొడవర్రు
ముంచేసింది!
ముంచేసింది!
ముంచేసింది!
ముంచేసింది!
ముంచేసింది!
ముంచేసింది!
ముంచేసింది!