తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందేలు | - | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందేలు

Mar 31 2025 11:10 AM | Updated on Mar 31 2025 1:36 PM

తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందేలు

తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందేలు

కోనేరుసెంటర్‌: బందరు మండలం కోన గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం అన్ని చోట్ల కవులు, వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తే ఈ గ్రామంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం కాయ్‌ రాజా కాయ్‌ అంటూ కోడిపందేలకు తెరలేపారు. పందేల విషయంలో తేడా వచ్చినప్పుడల్లా తమదైన శైలిలో ఒకరిపై ఒకరు బూతు పదాలు విసురుకుంటూ వివాదాలకు సైతం దిగారు. గ్రామంలోని శివారు ప్రాంతంలోని గంగానమ్మ గుడికి సమీపంలో వందలాది మంది జూదరులు ఒక చోటుకు చేరి పదుల సంఖ్యలో కోడిపందేలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు. ఆదివారం ఉదయం మొదలైన కోడిపందేలు మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కొనసాగినా పోలీసులు పట్టించుకున్నా పాపాన పోలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. పక్క గ్రామాల్లోని జూదరులకు ఫోన్‌లు చేసి మరీ పిలిపించి కోడిపందేలు నిర్వహించారు. పోలీసులకు భయపడే వాళ్లతో మీరేం భయపడాల్సిన అవసరం లేదు రండీ పోలీసులు మన బాబాయిలే వచ్చేయండీ అంటూ ధైర్యం ఇచ్చి మరీ పందేలకు పిలిచారు. పందెంకోళ్లకు కత్తులు కట్టి పందెం బరిలో రక్తం ఏరులై పారించారు. కాకి మాది నెమిలి మాది డేగ మాది అంటూ రూ.లక్షల్లో పందేలు కడుతూ పందెం కూతలు పెట్టారు. ఇక్కడ జరిగిన కోడిపందేలకు కోన గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో గ్రామాలకు చెందిన జూదరులు కోళ్లు పట్టుకుని రావటంతో ఆదివారం కోన గ్రామంలో జరిగిన కోడిపందేలు సంక్రాంతి బరిని తలపించాయి. తెలుగు తమ్ముళ్లు బరితెగించి పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement