మంగళగిరి: మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఈనెల 29, 30వ తేదీల్లో 31వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2023 నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ వై.అపర్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి(అప్‌కాస్ట్), పాఠశాల విద్యాశాఖ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కందుకూరుకు చెందిన సీకే దాస్ అకాడమి, చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, కోనేరు లక్ష్మయ్య, ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌ల సహకారంతో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.