
సమావేశంలో మాట్లాడుతున్న బండి పుణ్యశీల
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ స్కాంలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఏపీఐడీసీ చైర్‌పర్సన్ బండి పుణ్యశిల విమర్శించారు. విజయవాడ నగరంలో పేదలకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి టీడీపీ నాయకులు ఘరానా మోసానికి పాల్పడ్డారని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోసానికి పాల్పడిన కొట్టేటి హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో చట్టం ఎంతో ఉన్నతంగా పనిచేసి, బాధితులకు అండగా నిలిచిందన్నారు. భవానీపురంలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ మునిసిపాలిటీ పరిధిలో 2016 నుంచి 2019 వరకు జరిగిన కుంభకోణాల్లో ఆధారాలతో సేకరించి ఏ1 ముద్దాయి టీడీపీ మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావును అరెస్ట్ చేశారన్నారు. హనుమంతరావు వెనుక ఉన్న వారిని కూడా రాబోయే రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారన్నారు. టీడీపీ నాయకుల మోసానికి బలైన బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దళిత నాయకులు దాసి జయప్రకాష్ కెనడీ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల సొమ్మును జలగల్లా పీల్చారని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుంచి రూ. 4 కోట్లు వసూలు చేశారన్నారు. హనుమంతరావు చేసిన అవినీతిలో పెద్దలకు కూడా వాటా ఉందన్నారు. టీడీపీలోని బడా నాయకుల అండతోనే హనుమంతరావు ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సొమ్ము దోచేయడంలో టీడీపీకి ఉన్న శ్రద్ధ హనుమంతరావును చూస్తే తెలుస్తుందన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు గుడివాడ నరేంద్ర రాఘవ, కార్పొరేటర్లు అత్తలూరి ఆదిలక్ష్మి, మైలవరపు రత్నకుమారి, ఎండీ ఇర్ఫాన్, సీనియర్ నాయకుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల చేతిలో మోసపోయిన పేదలకు అండగా ఉంటాం ఏపీఐడీసీ చైర్ పర్సన్ బండి పుణ్యశీల