
కృష్ణా: ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రాకపోవటంతో మనోవేదనకు గురై ఒంటరి జీవితం భరించలేక ఆత్యహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచికచర్ల ఎస్‌ఐ పెంకె సత్య వెంకట సుబ్రహ్మణ్యం కథనం మేరకు కంచికచర్లకు చెందిన జె.హర్షవర్థన్(38) గత కొన్నాళ్లుగా పరిటాల గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. దొనబండలోని ఓ క్రషర్‌లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. హర్షవర్థన్‌కు కృష్ణాజిల్లా(ప్రస్తుతం ఏలూరు జిల్లా) ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన ప్రియాంకతో 2011లో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వివాహమైన తొలిరోజుల్లో దాంపత్యం సజావుగానే సాగింది. అనంతరం భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో వారిద్దరూ గత ఐదేళ్ల నుంచి విడివిడిగా ఉంటున్నారు. ప్రియాంక కుమారుడితో కలసి పుట్టింటి వద్ద ఉంటోంది. ఒంటరి జీవితం భరించలేక హర్షవర్థన్ ఈనెల 22వ తేదీన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
ఈనెల 23వ తేదీ రాత్రి సమయంలో ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న హర్షవర్ధన్ కనిపించాడు. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆదివారం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.