దేవుడ్‌పల్లి.. ‘పోడు’ లొల్లి..! | - | Sakshi
Sakshi News home page

దేవుడ్‌పల్లి.. ‘పోడు’ లొల్లి..!

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

బీట్‌ పరిధిలో ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అటవీశాఖ చర్యలు సాగు భూములు లాక్కుంటున్నారని అన్నదాతల ఆగ్రహం గిరిజనేతరులకు పట్టాలు లేవని అధికారుల స్పష్టీకరణ

కెరమెరి మండలం సుర్దాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బామ్నె రాము 40 ఏళుగా సాగు చేస్తున్నాడు. ఆయనకు అటవీ ప్రాంతంలో వివాదాస్పద మూడెకరాల భూమి ఉంది. రెండు రోజుల క్రితం అటవీ అధికారులు సాగు పనులను అడ్డుకున్నారు. జీవనాధారమైన భూమిని లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెరమెరి రేంజ్‌ పరిధిలో 70 మంది గిరిజనేతర రైతులందరిదీ ఇదే పరిస్థితి..

కెరమెరి: వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో సాగు భూముల లొల్లి మొదలైంది. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అటవీ భూముల్లో ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతుండగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కెరమెరి అటవీ రేంజ్‌ పరిధిలోని గోయగాం సెక్షన్‌ దేవుడ్‌పల్లి బీట్‌లో 450 హెక్టర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో 70 శాతం సాగులోనే ఉంది. ఇందులో 100 హెక్టార్ల(సుమారు 250 ఎకరాలు)ను ఆధీనంలోకి తీసుకుని ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమిపై ఆధారపడి కెరమెరి మండలం సుర్దాపూర్‌, ధనోరా, సావర్‌ఖేడా గ్రామాలకు చెందిన సమారు 70 మంది గిరిజనేతర రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

టైగర్‌ కారిడార్‌ ప్రాంతం

కెరమెరి మండలం దేవుడ్‌పల్లిలోని 67 కంపార్ట్‌మెంట్‌ అంతా టైగర్‌ కారిడార్‌ పరిధిలోకి వస్తుంది. గతేడాది పెద్దపులి సంచరించగా, చిరుత, ఇతర వన్యప్రాణుల కదలికలు కూడా ఉన్నాయి. తడోబా ప్రాంతానికి కనెక్టివిటీ ఉండటంతో పెద్దపులుల రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016 లో కూడా రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విత్తనాలు వేసే సమయంలో సాగు పనులను అడ్డుకున్నారు. రైతులు అప్పటి అటవీ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. మళ్లీ ఇప్పుడు అధికారుల చర్యలతో వివాదం తెరపైకి వచ్చింది.

భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్టువే..

దేవుడ్‌పల్లి బీట్‌ పరిధిలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్టుకు చెందినవి.. రైతులకు ఎలాంటి పట్టాలు లేవు. గిరిజనులై ఉండి, అటవీ హక్కు పట్టాలు ఉంటే సాగు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం.

– మజారొద్దీన్‌, ఎఫ్‌ఆర్వో, కెరమెరి

ప్రత్యామ్నాయం చూపాలి

25 ఏళ్లుగా ధనోరా సమీపంలో నాలుగెకరాల భూమి సాగు చేస్తున్నా. ఏటా వడ్డీలకు అప్పులు తెచ్చి పంట లు పండిస్తూ బతుకుతు న్నా. అధికారులు ఈ భూమిని లాక్కుంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి అందించి ఆదుకోవాలి. – షేక్‌ ఫరూక్‌, రైతు, ధనోరా

ఇరువర్గాల మధ్య వాగ్వాదం

స్థానిక ఎఫ్‌ఆర్‌వో మజారొద్దీన్‌ సిబ్బందితో కలిసి సోమవారం ధనోరా, సుర్దాపూర్‌ గ్రామాల మధ్య సాగు చేస్తున్న భూములోకి వెళ్లారు. రైతులు మూకుమ్మడి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంత నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం వెళ్లినా రైతులు అడ్డుకున్నారు. సాగు భూముల్లోకి వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా దారి మధ్యలో రాళ్లు వేశారు. ఓ దశలో సహనం కోల్పోయి రాళ్లదాడికి ప్రయత్నించగా, వాంకిడి సీఐ వేణుగోపాల్‌, కెరమెరి ఎస్సై సుధాకర్‌ ఘటనాస్థలికి చేరుకుని రైతులను సముదాయించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement