జిల్లా ఎన్నికల అధికారికి సన్మానం
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాను గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్‌పీవోలు హరిప్రసాద్, ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో మరణించిన ఉద్యోగులకు సంతాపం
ఎన్నికల విధుల నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జిల్లాలోని ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్టరాజు విధి నిర్వహణలో మృతి చెందినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల కోడ్ ముగిసిందని పేర్కొన్నారు.


