కుష్ఠుపై సమరం!
కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోనే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2028లోగా కుష్ఠు రహిత సమాజాన్ని స్థాపించాలనే ఆశయంతో అవగాహన సదస్సులు, ర్యాలీలు, సర్వేలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు నెలల కు ఒకసారి వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి సర్వే ప్రారంభించారు. 754 మంది ఆశవర్కర్లు ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ పరీక్ష ల ద్వారా అనుమానితులను గుర్తించనున్నారు. ప్రతిరోజూ 15 కుటుంబాలను పరిశీలిస్తారు. నిర్ణీత గడువులోగా జిల్లాలోని అన్ని కుటుంబాల పరిశీలన పూర్తికాకపోతే మరో వారం రోజులపాటు కార్యక్రమాన్ని పొడిగించనున్నారు.
84 మంది వ్యాధిగ్రస్తులు
జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 84 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగజ్‌నగర్ మండలం ఆరెగూడ, కౌటాల మండలం కన్నెపల్లి, ముత్తంపేట, చింతలమానెపల్లి మండలం గూడెం, దిందా, సిర్పూర్(టి) మండలం లో నవెల్లి, బెజ్జూర్, వాంకిడి, దహెగాం మండలాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఏటా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ప్రభుత్వం నివారణకు చర్యలు చేపడుతున్నా ప్రజలు వైద్యపరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. మల్టీ డ్రగ్ చి కిత్స ద్వారా తీవ్రతను బట్టి 6నుంచి 12 నెలల్లో వ్యా ధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రస్తుతం కాగజ్‌నగర్ పీహెచ్‌సీలో మాత్రమే కుష్ఠు వ్యాధి నివారణ విభాగం ఉంది. గురు, శుక్రవారాల్లో లెప్రసీ సొసైటీ ఆధ్వర్యంలో చికిత్స అందుతుంది. ఆశ కార్యకర్తలే బాధితులకు మందులు అందిస్తారు. వైకల్యం ఏర్ప డే అవకాశం ఉంటే ఫిజియోథెరపి కూడా చేస్తారు.
గుర్తింపు సర్వే షురూ..
కుష్ఠులో పీబీ(పాసిబాసిల్లరి), ఎంబీ(మల్టీబాసిల్లరి)గా కేసులు ఉంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతో పాటు ఇతర లక్షణాలతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు 14 రోజులపాటు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే చేపడుతున్నారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. చర్మంపై పాలిపోయిన, గోధుమ, రాగి రంగు మచ్చలు ఉండటం, కునుబొమ్మల వెంట్రుకలు రాలడం, చేతి వేళ్ల స్పర్శ కోల్పోయి వంకరపోవడం వంటి లక్షణాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, పూర్తి ఎండీటీ చేయించడం ద్వారా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు.
చికిత్సతోనే నయం
కుష్ఠు అంటువ్యాధి కావడంతో ప్రారంభ దశలోనే గురిస్తే మేలు. చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చు. భయం, ఆందోళనలు వీడి ప్రజలు అనుమానిత మచ్చలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవాలి. జిల్లాలో ఈ నెల 31 వరకు గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతీ గడపకు వెళ్లి వైద్యసిబ్బంది అనుమానితులను గుర్తిస్తారు. కుష్ఠు నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి.
– సీతారాం, డీఎంహెచ్‌వో
కుష్ఠుపై సమరం!


