డేంజర్ ఘాట్స్..!
మూలమలుపులతో అధ్వానంగా ఘాట్ రోడ్లు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు శూన్యం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయని వైనం
కెరమెరి(ఆసిపాబాద్): జిల్లాలో ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మలుపులు తిరిగి న రహదారులపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కెరమెరి ఘాట్ రోడ్డుపై 9 కిలోమీటర్ల మేర 37 మూలమలుపులు ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర పరంధోళి ఘాట్ రోడ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. తాజాగా గురువారం పరంధోళి ఘాట్ రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురికి గాయాలు కాగా, మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. బస్సు కుడివైపు వెళ్లి ఉంటే పెద్ద లోయలోకి పడి ఉండేది. డ్రైవర్ చాకచాక్యంతో వ్యవహరించడంతో పత్తి చేనులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది.
కెరమెరి ఘాట్ రోడ్డుపై 37 మలుపులు
ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు వెళ్లే దారిలో అందంగా కనిపించే కెరమెరి ఘాట్ రోడ్డుపై 9 కిలోమీటర్ల మేర 37 మూలమలుపులు ఉన్నాయి. ఈ రహదారిలో ఎక్కడా కూడా ప్రమాద సూచికలు లేవు. మలుపులు కూడా అతి దగ్గరగా ఉండటంతో వాహనాలు తిప్పడం కూడా కష్టసాధ్యం. పదేళ్ల క్రితం సిగ్నల్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆకతాయిలు ధ్వంసం చేశారు. మూడేళ్ల క్రితం భూతద్దాలు ఏర్పాటు చేయగా ఏడాదికే కొందరు పగులకొట్టారు. ఆర్‌అండ్‌బీ అధికారుల మళ్లీ కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనుభవం ఉన్న డ్రైవర్లు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నా.. కొత్తవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కెరమెరి ఘాట్ రోడ్డు జరిగిన ప్రమాదాలు..
కెరమెరి ఘాట్ రోడ్డుపై మూలమలుపుల కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
మూలములుపులతో ప్రమాకరంగా కెరమెరి ఘాట్ రోడ్డు
ముందుకు సాగని పరంధోళి రోడ్డు నిర్మాణం
తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కొనసాగుతున్న పరంధోళి ఘాట్ రోడ్డు నుంచి 10 గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. 18 ఏళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్రి గ్రామం నుంచి పరంధోళికి బీటీ రోడ్డు వేస్తుండగా అటవీశాఖ అనుమతులు లేవనే సాకుతో 2008లో పనులు నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి దీనిని పట్టించుకోలేదు. ఈ రోడ్డుపైనే గురువారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
డేంజర్ ఘాట్స్..!
డేంజర్ ఘాట్స్..!


