మార్కెట్ సౌకర్యం కల్పించాలని ధర్నా
కౌటాల(సిర్పూర్): మండల కేంద్రంలో కూరగాయలు విక్రయించడానికి మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిరువ్యాపారులు గురువారం కౌటాల, కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కౌటాలలో కూరగాయలు విక్రయించడానికి ప్రత్యేక స్థలం లేకపోవడంతో ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూరగాయలు, చేపలు, చికెన్, మటన్ విక్రయించడానికి మండల కేంద్రంలో ప్రత్యేక స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థా నిక ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని వ్యాపారుల సమస్యను ఎంపీడీవో కోట ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. కౌటాల పాత పీహెచ్‌సీ స్థలంలో తాత్కాలికంగా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోడ్డుకిరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని ఎస్సై వారికి సూచించారు.


