
‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ జూనియర్ కళాశాల, పదో తరగతి వారికి బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 63 మంది, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే పదో తరగతి పరీక్షలకు 145 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గిన్నెధరి ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, విష జ్వరాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశ్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.