
హౌరా పట్టాలెక్కేనా..?
● కలకత్తాకు బెంగాళీలు, వ్యాపారుల రాకపోకలు ● కాగజ్‌నగర్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని విన్నపం ● ప్రతిపాదనలకే పరిమితమైన వైనం
కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు హౌరా ఎక్స్‌ప్రెస్ నడిపించాలనే కల నెరవేరడం లేదు. కా జీపేట్ నుంచి కాగజ్‌నగర్ మీదుగా మహానగరమై న కలకత్తాకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. రైల్వే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పిస్తున్నా బుట్టదాఖలే అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని బసంత్‌నగర్, రామకృష్ణాపూర్, నజ్రూల్‌నగర్, రవీంద్రనగర్, సిర్పూర్(టి) తోపాటు మహారాష్ట్రలోని బల్లార్షా తదితర ప్రాంతాల్లో బెంగాళీలు అధిక సంఖ్యలో స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా నిత్యం వ్యాపార నిమిత్తం కలకత్తాకు తరచూ వెళ్తుంటారు.
వ్యాపార నిమిత్తం
పారిశ్రామిక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్ ప్రధాన రాజధాని కలకత్తాకు వాణిజ్య అవసరాల కోసం ఎంతోమంది రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో దుస్తులు, తదితర వస్తువుల తయారీ కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీరి సౌకర్యార్థం రైలు లేకపోవడంతో వీరంతా కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వరంగల్, విజయవాడ మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అదే కాజీపేట నుంచి కాగజ్‌నగర్ మీదుగా వెళ్తే తక్కువ దూరంతోపాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయి. గతంలో కాగజ్‌నగర్ నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక బోగీ ఉండేది. అది కాజీపేట వరకు వెళ్లి అక్కడి నుంచి లింక్ ఎక్స్‌ప్రెస్‌కు కలుపుకుని వయా వరంగల్ మీదుగా ఒక బోగీ హౌరాకు వెళ్లేది. కానీ కొన్ని కారణాలతో దానిని రద్దు చేశారు.
ప్రయాణ ప్రయాస..
ప్రయాణికులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే కలకత్తా వరకు సుమారు రెండు వేల కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి. వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సికింద్రాబాద్ లేదా, కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాలి. ఫలక్‌నూమ ఎక్స్‌ప్రెస్(12704), ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18045), వయా నల్గొండ, సికింద్రాబాద్ – షాలీమార్(కోల్‌కత్తా) వీక్లి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(22850), వయా వరంగల్ మీదుగా వెళ్తున్నాయి. హౌరా రైలు ప్రారంభమైతే బసంత్‌నగర్, కాగజ్‌నగర్‌లోని బెంగాళీ క్యాంప్, బల్లార్షాలోని బెంగాళీ క్యాంప్‌లలో సుమారు 52వేల మంది బెంగాళీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్
కేంద్ర మంత్రులు సహకరిస్తేనే..
కాగజ్‌నగర్ మీదుగా హౌరా వరకు రైలు నడిపించేందుకు కేంద్ర మంత్రులు సహకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు, ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కలకత్తాకు రైలు నడపాలని పలుమార్లు ప్రతిపాదనలు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసినప్పటికీ రైల్వే అధికారులు స్పందించకపోవడంతో ఈ మార్గం గుండా రైలు నడిపిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.