
పోషకాహారలోపం గుర్తింపునకు సర్వే
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్త సర్వే చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల తన చాంబర్‌లో డీఎంహెచ్‌వో సీతారాం, యూనిసెఫ్ ప్రతినిధులతో జిల్లాలో పోషకాహార లోపం కలిగిన పిల్లల నిష్పత్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్ల లకు సకాలంలో సరైన ఆహారం, మందులు అందించి పోషకాహార లోపాన్ని నియంత్రించాలన్నారు. యూనిసెఫ్ బృందం సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఖ్యాతి తివారి, న్యూట్రిషియన్ ఆఫీసర్ రేష, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతులు కల్పించాలి
కాగజ్‌నగర్‌టౌన్: నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించి, లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బోరిగాం శివారులో 12 బ్లాక్‌ల్లో 228 డబుల్ బెడ్రూంలు నిర్మించామన్నారు. విద్యుత్, తాగునీరు, కిటికీలు, తలుపులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు, పెయిటింగ్ తదితర పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ హౌజింగ్ పీడీ వేణుగోపాల్, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.