
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనం
నిర్మల్‌చైన్‌గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు.
దరఖాస్తు గడువు..
అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
అవగాహన లేమి..
బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్‌లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్‌లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీడీలు చుడుతున్న మహిళా కార్మికులు
ఉమ్మడి జిల్లా వివరాలు
జిల్లా బీడీ కార్మికులు
నిర్మల్ 70,000
ఆదిలాబాద్ 3,000
కుమురంభీం 1,500
మంచిర్యాల 700
మొత్తం 75,200
సద్వినియోగపర్చుకోవాలి
బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్,
బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్
అర్హతలు
పదోతరగతి, ఇంటర్‌లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి.
సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు.
దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు.
తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి.
కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి.
జత చేయాల్సిన పత్రాలు
2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం.
విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా
గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో
ఉపకార వేతనం (రూ.ల్లో)
తరగతి స్కాలర్‌షిప్
1 నుంచి 4 1,000
5 నుంచి 8 1,500
9 నుంచి 10 2,000
ఇంటర్ 3,000
డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000