
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్‌కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్‌కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు.