
‘స్థానిక’ ఎన్నికల్లో మార్గదర్శకాలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సోమవారం ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నిక మార్గదర్శకాలు, నిబంధనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీపీవో, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకానికి జాబితా రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సమీక్షలు నిర్వహించాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు. వాగులు, ఒర్రెలు ఉప్పొంగిన సమయంలో బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జిల్లా కేంద్రంలోని బాబాపూర్ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలకు చెందిన హిమబిందు, బిక్కుబాయిని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అభినందించారు. విద్యార్థినులు ఎవరెస్టు శిఖరం బేస్ పాయింట్ వద్దకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య, డీఆర్‌డీవో దత్తరావు, డీడబ్ల్యూవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే