
మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కెరమెరి(ఆసిఫాబాద్): మాదక ద్రవ్యాల వినియోగం జీవితంతోపాటు కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా సోమవారం మండలంలోని మోడి బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత ప్రమాదకర మత్తు వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి ప్రభావంపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ మోసాలకు గురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ గురించి తెలిస్తే వెంటనే 1908 లేదా 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్‌ఎం ప్రేందాస్ పాల్గొన్నారు.