ఎట్టకేలకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మోక్షం

Jul 13 2025 7:38 AM | Updated on Jul 13 2025 7:38 AM

ఎట్టకేలకు మోక్షం

ఎట్టకేలకు మోక్షం

● జిల్లాలో 7,154 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు ● రేపటి నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం ● సెప్టెంబర్‌లో బియ్యం అందించేందుకు ఏర్పాట్లు

నిబంధనలివే..

కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతంలో వార్షికాదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల మించి ఉండకూడదు. మాగాణి 3.5 ఎకరాలు, మెట్ట అయితే 7.5 ఎకరాల మించకుండా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, నాలుగుచక్రాల వాహనదారులను అనర్హులుగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు నంబర్లతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసిఫాబాద్‌: కొత్త కార్డుల మంజూరు ప్రక్రియలో ఎట్టకేలకు ముందడుగు పడింది. దరఖాస్తుదారుల ఎదురుచూపులకు త్వరలోనే మోక్షం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు సైతం అందుకు తగిన ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం సమగ్ర కులగణన సర్వే ప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తించింది. అర్హులైన చాలామంది కొత్త కార్డుల కోసం, ఇప్పటికే కార్డులు ఉన్న కుటుంబాల్లో కూడా కొంతమంది పేర్లు నమోదు కాకపోవడంతో.. వారు పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబంలో చిన్నపిల్లలు, పెళ్లయిన కొత్త కోడళ్లు కూడా పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికంగా తీసుకోవడంతో రేషన్‌ కార్డులకు ప్రాధాన్యత ఏర్పడింది.

7,154 కొత్త కార్డులు

జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో 314 రేషన్‌ దుకాణాలు ఉండగా, ప్రస్తుతం 1,39,734 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 13,192 అంత్యోదయ కార్డులు కాగా, 1,26,542 ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు. ప్రతినెలా సుమారు 2,949.746 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించారు. కొత్తగా జారీ చేసిన రేషన్‌ కార్డులకు సెప్టెంబర్‌ నుంచి సరుకులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో కార్డులేని వారు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 1,63,647 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్త రేషన్‌కార్డుల కోసం 17,044 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు మీసేవ కేంద్రాల్లో సైతం కొత్తగా దరఖాస్తులు చేశారు. ప్రస్తుతం కొత్తగా 7,154 రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కొత్తకార్డులు జారీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement