
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్‌ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్‌సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు.
కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్
కరీంనగర్‌క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్‌చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్‌పల్లికు చెందిన శ్రీనివాస్‌తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్‌పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్‌కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
గుడ్లబోరిలో మద్యనిషేధం
కౌటాల: మండలంలోని గుడ్లబోరి గ్రామంలో గురువారం మద్య నిషేధం విధిస్తున్నట్లు మహిళలు తీర్మానించారు. గుడ్లబోరి పంచాయతీ పరిధిలోని విజయనగరం, వైగాం, సైదాపూర్, మరియపూరం గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని వారుత తెలిపారు. యువత మద్యానికి బానిసై ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం, గంజాయి విక్రయిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళలు తీర్మానం చేశారు. శ్రావంతి, విఠబాయి, సవిత, తారబాయి, మమత, పోచుబాయి, విమలబాయి పాల్గొన్నారు.