
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్‌రూరల్: వర్షాకాలం నేపథ్యంలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల వివరాలు, వంట గదిలో సరుకులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం, విద్యనందించాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి నదీమ్ అహ్మద్, ప్రిన్సిపాల్ రత్నబాయి తదితరులు పాల్గొన్నారు.