కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య
● ఇంటర్ బోర్డ్ డిప్యూటీ సెక్రెటరీ యాదగిరి
ఆసిఫాబాద్‌రూరల్/వాంకిడి/కాగజ్‌నగర్‌టౌన్: జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించాలని ఇంటర్మీడియెట్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ యాదగిరి అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్, వాంకిడిలోని ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను శుక్రవారం డీఐఈవో కళ్యాణితో కలిసి తనిఖీ చేశారు. కళాశాలల్లో రికార్డులు పరిశీలించి గత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు, విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ప్రభుత్వ కళాశాలల్లో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కాగజ్‌నగర్‌లోని కళాశాల పాతభవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనంలోనే తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 15 రోజుల్లో కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపాళ్లు రాందాస్, సీహెచ్ కళ్యాణి, అధ్యాపకులు శ్రీనివాస్, రమేశ్, ఎం.చంద్రయ్య, సంతోష్, శ్రీధర్, సురేంద్రకుమార్, కిరణ్‌కుమార్, తిరుపతి, అర్చన, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.


