కొందరికే భరోసా!
రెబ్బెన: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుభరోసా పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులు పంటల సాగు పెట్టుబడుల కోసం నానాపాట్లు పడుతున్నారు. సాగుకు యోగ్యమైన భూములకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అందజేయాలని భావించింది. అయితే యాసంగి పంటల సీజన్ పూర్తయ్యి వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందలేదు. కేవలం కొంతమంది రైతులకు మాత్రమే సాయం అందగా వేలాది మంది రైతులు రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
ఆశల్లో రైతులు..
గత యాసంగి సీజన్‌లో రైతులపై ప్రకృతి కన్నెర్ర చే సింది. అకాల వర్షాలతో అన్నదాతలకు రావాల్సి న దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పంటలకు తెగుళ్లు, చీడపీడలు ఆశించి పంటలను దె బ్బతీశాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు అధికాసార్లు మందులు పిచికారీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడిసాయాన్ని అందించి ఉంటే పంటల పెట్టుబడులకు ఎంతో కొంత ఉపశమనం లభించేదని రైతులు పేర్కొంటున్నారు. ఎట్టకేలకు యాసంగి సీజన్ ముగియగా ఆ శించిన స్థాయిలో పంట దిగుబడులు రాక చాలా మంది రైతులు నష్టపోయారు. ప్రస్తుతం రైతులు వానాకాలం పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తిదే అగ్రస్థానం. ఇప్పటికే రైతులు భూముల్లో దు క్కి పనులు పూర్తిచేసి విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలకరి వర్షాలు పడగానే విత్తనాలు విత్తాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అయినా ప్రభుత్వం రైతుభరోసా అందిస్తే విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడిసాయం డబ్బులు ఆసరాగా ఉంటాయని రైతులు ఆశపడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో కౌలురైతులు
కౌలురైతులకు కూడా పంటల సాగుకు పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా నేటికీ కౌలురైతులకు అందజేసే పెట్టుబడిసాయంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు పెరుగుతున్న భూముల కౌలుధరలు, మరోవైపు పెరిగిన విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలతో కౌలురైతులు కుదేలవుతున్నారు. పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలురైతులకు సైతం పెట్టుబడిసాయం, బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
పత్తి చేనులో
నాగలి దున్నుతున్న రైతు (ఫైల్)
యాసంగిలో 87,062 మంది రైతులకే సాయం
ఇంకా అందించాల్సిన పెట్టుబడి సాయం రూ.131.97 కోట్లు
ఇప్పటికే మొదలైన వానాకాలం సాగు పనులు
విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అన్నదాత తిప్పలు
43,373 మంది రైతులకు అందని సాయం
జిల్లాలోని రైతులు సుమారు 4.35లక్షల ఎకరాల్లో ఏటా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సాగుకు యోగ్యంగా ఉన్న భూములు, రైతుల వివరాలను సేకరించిన అధికారులు రైతుభరోసా పథకం కింద జిల్లాలో 1,30,435 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు సీజన్‌లకు కలిపి రూ.10వేలు చెల్లించగా ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా ద్వారా ఎకరానికి రూ.6వేలు చొప్పున రెండు సీజన్‌లు కలిపి రూ. 12వేలు యాసంగి సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతులకు ముందుగా ఆపై ఎక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతులకు పెట్టుబడిసాయాన్ని అందించాలని, ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు గల రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో ఇప్పటివరకు 87,062 మంది రైతులకు గానూ రూ.93,95,12,916లు డబ్బులు జమ చేసింది. నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు నేటికీ పెట్టుబడిసాయం అందలేదు. జిల్లాలో ఇంకా 43,373 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద రూ.131.97 కోట్లు జమ కావాల్సి ఉంది.
ఆందోళన అవసరం లేదు
ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడిసాయం కింద నాలుగు ఎకరాల వరకు ఎకరానికి రూ. 6వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసింది. మిగిలిన రైతులకు ఇంకా జమకావాల్సి ఉన్న మాట వాస్తవమే. ఎందుకు జమ చేయలేదో సమాచారం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులందరికీ పెట్టుబడిసాయం అందుతుంది.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి
కొందరికే భరోసా!


