సర్పంచ్ అనే నేను..
ఆసిఫాబాద్: ‘గ్రామ పంచాయతీ సర్పంచునైన/సభ్యుడినైన...........అను నేను’ అంటూ సోమవారం పల్లె పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలు ఉన్నాయి. మూడు సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 332 మంది సర్పంచులు, 2,833 మంది వార్డు సభ్యులు ప్రత్యేకాధికారుల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిరోజు గ్రామాభివృద్ధిపై చర్చ కొనసాగించనున్నారు.
ప్రమాణ స్వీకారం ఇలా..
2024 ఫిబ్రవరి 1తో పాత పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ప్రత్యేకాధికారులు 20 నెలలపాటు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సర్పంచులు సోమవారం ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి ఎన్నికల ఫలితాల ధ్రువపత్రాలు(ఫారం–15) రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక్కో ప్రత్యేకాధికారికి ఒకటికి మించి బాధ్యతలుంటే పంచాయతీ కార్యదర్శులు చేయిస్తారు. అవసరమున్న చోట ఉపాధ్యాయులను నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణ పత్రంపై సంతకం చేయాలి. ఆ తర్వాతే కొత్త సర్పంచులకు పూర్తి బాధ్యతలు అమలవుతాయి. సంతకాల తర్వాత జాయింట్ చెక్‌పవర్ ఫామ్‌లను సేకరించి, బ్యాంకులకు పంపుతారు. సర్పంచ్ లేకపోతే సభ్యుల సంతకాలు ముందుగా తీసుకుంటారు. ఈ ప్రక్రియలు అన్నీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 40– 41 ప్రకారం జరుగుతాయి.
విధులు, బాధ్యతలు
సర్పంచులు గ్రామ పంచాయతీల పరిపాలనాధికారిగా వ్యవహరిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తారు. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ చేస్తారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభ, నష్టాల రిపోర్టులు సమర్పించాలి. ఎన్నికల తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ నిర్వహించాలి. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలి.


