తనిఖీలకు వేళాయె..
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు గుర్తించి ప్రభుత్వ పాఠశాలలను గాడిన పెట్టేందుకు ప్రత్యేక బృందాలు సోమవారం నుంచి తనిఖీలు చేపట్టనున్నాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ అంశాన్ని పరిశీలించి వివరాలతో నివేదికలు రూపొందించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 37 మందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి ఇప్పటికే కలెక్టరేట్‌లో ప్రత్యేక శిక్షణ అందించారు.
686 పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా లోకల్ బాడీ కింద 686 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 526, ప్రాథమికోన్నత 100, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. తనిఖీల కోసం, సమగ్ర సమాచార సేకరణ కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలలను ఆరు బృందాలు తనిఖీ చేయనుండగా, ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను సందర్శిస్తారు. మరో బృందం రోజుకు రెండు ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేస్తుంది. ఇక మిగిలిన రెండు బృందాలు ఉన్నత పాఠశాలల తనిఖీ కోసం కేటాయించారు. ఈ ఒక్కో బృందంలో ఎనిమిది మంది చొప్పున ఉంటారు. విద్య సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలిస్తారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు జిల్లాలోని అన్ని పాఠశాల సందర్శించి రిపోర్టు రూపొందించాలి. యాప్‌లో వివరాలు అప్‌లోడ్ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తారు.


