‘రిజిస్ట్రేషన్’లో సిబ్బంది కొరత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. గత నాలుగు నెలలుగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కార్యాలయంలో ప్రతీరోజు 8 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గతేడాది 1,985 రిజిస్ట్రేషన్లు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 2,500 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి ఏటా రూ.కోట్ల ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతీరోజు ఆదాయం వస్తున్నా పోస్టులు భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
సిబ్బంది కొరతతో తిప్పలు..
జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక సబ్ రిజిస్ట్రార్, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు అటెండర్ ఉండాలి. ప్రస్తుతం ఒక జూ నియర్ అసిస్టెంట్, ఒక అటెండర్‌తోనే నెట్టుకువస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మికి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాలకు జిల్లా కేంద్రంలో ఒకే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రతీరోజు అనేక మంది రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆస్తులు, ప్లాట్లు, వివాహాలు, ఈసీలతోపాటు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రక్రియ సాగుతుంది. అలాగే స్టాంపు పేపర్లు కూడా ఈ కార్యాలయంలో విక్రయిస్తారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అవసరాల కోసం వచ్చినవారు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకో వాలి. స్లాట్ బుకింగ్‌లో నిర్ణీత సమయానికి కొనుగోలు, అమ్మకందారులు, సాక్షులు హాజరైన అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. స్లాట్ సమయానికి హాజరై ఫింగర్‌ప్రింట్, ఫొటో, సంతకాలు చేస్తే 30 నిముషాల్లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ అందజేస్తారు. సిబ్బంది కొరత విషయమై ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ లక్ష్మిని సంప్రదించగా.. రెండు నెలలుగా ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


