కొత్త పాలన!
పాత భవనాల్లో..
● శిథిలావస్థలో పంచాయతీ భవనాలు
ఇదేం కార్యాలయం
తిర్యాణి: తిర్యాణి మండలం గుండాలలో 500పైగా జనాభా ఉంది. ఇప్పటివరకు పక్కా పంచాయతీ భవనం లేదు. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద పంచాయతీ కార్యాలయం కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. రికార్డులు, ఇతర సామగ్రిని ఇక్కడే భద్రత పరుస్తున్నారు. సమావేశాలు మాత్రం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్ ఎదుట ఖాళీ స్థలంలో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్/రెబ్బెన: రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో కొనసాగిన పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జిల్లాలోని పంచాయతీ కార్యాలయాల నిర్వహణకు పక్కా భవనాలు కరువయ్యాయి. దీంతో అద్దె, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల్లోని ఇరుకు గదుల్లోనే కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. గతంలో ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో అందుబాటులో పాత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో తాత్కాలికంగా ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట అద్దెకు తీసుకుని కార్యాలయాలు కొనసాగించారు. ఇప్పటికీ కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో కొత్త సర్పంచులు సైతం పాత భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
218 పంచాయతీలకే పక్కా భవనాలు
జిల్లాలో మొత్తం 335 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 218 పంచాయతీలకు మాత్రమే పక్కా భవనాలు ఉండగా, మిగితా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.


