
● జిల్లా వ్యాప్తంగా 81 వాహనాలు ● ‘ఫిట్‌నెస్’ పొందినవి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్ పై దృష్టి సారించడంలేదన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరం పునఃప్రారంభానికి గడువు సమీపిస్తోంది. మరో వారంరోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల సామర్థ్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మే 15తోనే గడువు ముగిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో 81 బస్సులు..
జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు చేరవేసేందుకు 81 బస్సులను వినియోగిస్తున్నాయి. ఫిట్‌నెస్ ఉంటేనే ఆ బస్సు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ సంవత్సరం మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణాశాఖ అధికారుల వద్ద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాహన సామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది కొన్ని బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించారు. ఫిట్‌నెస్ చేయించని బస్సులు జూన్ 12 నుంచి రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాల్సి ఉండగా కేవలం 31 బస్సులకు మాత్రమే చేయించుకున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 50 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. ఫిట్‌లెస్ బస్సులు రోడ్లపైకి వస్తే అనుకోని ప్రమాదాలు సంభవించి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
తల్లిదండ్రులు సైతం..
తమ పిల్లలను బస్సుల్లో పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు నెలకోసారి వాహనంలో ప్రయాణించాలి. బస్సు కండీషన్, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా? లేదా? అనే విషయం గమనించాలి. పరిశీలించిన వివరాలను అధికారులకు తెలియజేయాలి. బస్సులో సమర్థవంతమైన డ్రైవర్, క్లీనర్, అటెండర్ ఉన్నారా? లేదా పరీక్షించుకోవాలి. ఫిట్‌నెస్ పత్రాలు లేకుండా ఫిర్యాదు చేయాలి. ఇంటి నుంచి బస్టాప్ వరకు పిల్లలతో వచ్చి బస్సు ఎక్కించాకే తిరిగి ఇంటికి వెళ్లాలి. బస్సులు, ఆటోలు ఇతర వాహనాల్లో పిల్లలను పంపించినప్పుడు ఎక్కువ మందిని కూర్చోబెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న విషయాన్ని మర్చిపోరారు.
జిల్లా వివరాలు
ప్రైవేటు పాఠశాలలు 107
విద్యార్థుల సంఖ్య 30,662
బస్సులు 81
ఫిట్‌నెస్ చేయించిన బస్సులు 31
చేయించాల్సిన బస్సులు 50
ఫిట్‌నెస్ లేకుంటే సీజ్‌చేస్తాం
ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని ఇదివరకే యాజమాన్యాలకు తెలియపరిచాం. ఫిట్‌నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను తరలించే బస్సులను సీజ్ చేస్తాం. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఇతర వాహనాలనూ సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్ రద్దు చేస్తాం. జూన్ 12లోపు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. – గద్దె మోహన్, ఎంవీఐ
నిబంధనలు ఇవే..
స్కూల్ బస్సుకు తప్పనిసరిగా పసుపు కలర్ వేయించడంతో పాటు నాలుగువైపులా పాఠశాల పేరు రాయించాలి.
డ్రైవర్‌కు నాలుగు సంవత్సరాల సీనియార్టీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ వివరాలను జిల్లా రవాణశాఖ అధికారులకు తెలియజేయాలి. డ్రైవర్ కచ్చితంగా యూనిఫాం కలిగి ఉండాలి.
బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు. మూడు నెలలకోసారి డ్రైవర్‌కు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
విండ్ స్క్రీన్, వైపర్, లైటింగ్స్, మెకానికల్ కండీషన్ పనితీరును రిజిస్టర్‌లో రాయాలి. బడి బస్సుల పార్కింగ్ కోసం విద్యాలయాల ప్రాంగణంలో ప్రత్యేక స్థలం కేటాయించాలి.
పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సుకు ఒక అటెండర్‌ను నియమించాలి.
సీటింగ్ కన్నా ఎక్కువ మంది విద్యార్థులను తరలించడం నిషేధం.