పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
పెంచికల్‌పేట్(సిర్పూర్): పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని జైహింద్‌పూర్ గ్రామంలో అటవీ అధికారుల తీరుకు నిరసనగా పంట చేలలో నిరసన చేస్తున్న రైతులతో సోమవారం మాట్లాడారు. ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ప్లాంటేషన్ పేరుతో అటవీ అధికారులు సాగు భూములను లాక్కుంటున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు దీక్ష చేస్తున్న సమీపంలో అక్కడే ఉన్న బెజ్జూర్ ఇన్‌చార్జి రేంజ్ అధికారి శ్రావణ్‌కుమార్‌తో ఆయన మాట్లాడారు. అటవీ అధికారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రైతులతో పాటు అటవీశాఖ అధికారులు పోడు భూముల నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ సర్పంచులు సుధాకర్, చంద్రమౌళి, నాయకులు రాజన్న, కృష్ణ, సదాశివ్, లస్మయ్య, శంకర్‌గౌడ్, ఉమామహేశ్ తదితరులు పాల్గొన్నారు.


