
సరిహద్దులో ఏనుగుల సంచారం
చింతలమానెపల్లి(సిర్పూర్): సరిహద్దుల్లో ఏనుగుల సంచారంతో జిల్లా అటవీశాఖ అప్రమత్తమైంది. గతేడాది ఏప్రిల్‌లో చింతలమానెపల్లి మండలం బూరెపల్లి, పెంచికల్‌పేట్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు చంపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. జిల్లా నుంచి ఏనుగు సరిహద్దు దాటేవరకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని మురుంగావ్ అటవీ ప్రాంతంలో సుమారుగా 25కు పైగా ఏనుగులు ఉన్న గుంపు తిరుగుతూ ఉంటుంది. ఈ ఏనుగుల గుంపు నుంచే జిల్లాకు గతేడాది ఏనుగు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. తాజాగా అదే గుంపునకు చెందిన ఏనుగులు గడ్చిరోలి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించాయి. మూడు నెలల నుంచి గడ్చిరోలి జిల్లా కేంద్రం సమీపంలోని కాఠాని, వైన్‌గంగ నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల సమీపంలో తిరుగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి ఏకంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి రావడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
సమాచారం కోసం సంప్రదింపులు
గడ్చిరోలి నుంచి చాముర్షి వరకు ఉన్న అటవీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉంది. గడ్చిరోలి జిల్లాలోని ఆష్టి సమీపంలోని అటవీ ప్రాంతం చింతలమానెపల్లి మండలానికి ప్రాణహిత నది మాత్రమే హద్దుగా ఉంది. గతేడాది ఇదే ప్రాంతం నుంచి ఏనుగు మన జిల్లాలోకి ప్రవేశించింది. చాముర్షి తాలూకా కేంద్రం సమీపంలోని వ్యాడ్ గ్రామంలో ఒక యువకుడిపై నెల రోజుల క్రితం ఏనుగు దాడి చేయడంతో మృతి చెందాడు. గడ్చిరోలి పట్టణానికి మన సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల రోడ్డుమార్గం ఉండగా.. అటవీ ప్రాంతం గుండా 50 లేదా 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర అటవీ అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నారు. ఏనుగులు సంచరిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండగా.. వాస్తవాలు తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఖర్జెల్లి ఎఫ్‌ఆర్‌వో ఇక్బాల్ మాట్లాడుతూ.. సమాచారం కోసం గడ్చిరోలి జిల్లా అటవీ అధికారులతో సంప్రదించామని తెలిపారు. స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏనుగులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు తక్కువని తెలిపారు.
అప్రమత్తమైన జిల్లా అటవీశాఖ