
కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో అకాల వర్షం, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. జనజీవానానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వాగుల వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలతోపాటు మరో మూడు అదనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఖరీఫ్‌లో విత్తనాలు, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎస్‌వో వినోద్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు.