
స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలని వినతి
రెబ్బెన/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలు విడుదలయ్యేలా చూడాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారితోపాటు డీఈవో యాద య్యకు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గత విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించామన్నారు. ప్రారంభంలో మూడు నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసి, ఆపై అందించలేదని తెలిపారు. ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. అలాగే జిల్లాలోని 50 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, శిక్షకులకు రూ.3వేల చొప్పున పారితోషకం ప్రభుత్వం నుంచి అందాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ వీరశంకర్, అసోసియేట్ అధ్యక్షుడు పర్ష చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.