ఆసిఫాబాద్: జిల్లాలో ఆది, సోమవారం రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నిల్వలు పెరిగిన నేపథ్యంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేసినట్లు ప్రకటించారు. డిసెంబర్ 3 నుంచి యథావిధిగా కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. రైతులు గమనించాలని కోరారు.
నేడు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఆసిఫాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని 739 పాఠశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పో టీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 446 పాఠశాలల్లో రూ.17.74 కోట్లతో 90 శాతం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేజీబీవీల్లో 58 ఉపాధ్యాయ ఖాళీల్లో ఒప్పంద పద్ధతిన 28 భర్తీ చేశామని తెలిపారు. కేజీబీ వీల్లోని రెగ్యులర్ ఉపాధ్యాయులు డీఎస్సీలో ఎంపికయ్యారని, త్వరలో నోటిఫికేషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. మరో 46 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని మండల కమిటీల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు అమలు చేస్తున్నామని వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌రూరల్: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు అర్హత గల మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విద్యాలయాల్లో 2024లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు, పీహెచ్‌డీ, పీజీలో 60శా తం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. డిసెంబర్ 31లోగా tela nganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకుని, జనవరి 20లోగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలని సూచించారు.