
పంటల బీమాకు కసరత్తు
● ఈ వానాకాలం సీజన్ నుంచే బీమా అమలు ● ప్రీమియం పూర్తిగా చెల్లించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ● జిల్లాలో 1.37 లక్షల మంది రైతులకు ప్రయోజనం ● పథకం అమలుపై జిల్లా అధికారులకు శిక్షణ పూర్తి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రకృతి వైపరీత్యాలతో ఏటా పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పంట బీమా అమలుకు కసరత్తు చేస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ నుంచే పథకాన్ని వర్తింపజేయాలని యోచిస్తోంది. ఇందుకోసం జిల్లాస్థాయిలో వ్యవసాయాశాఖ అధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ భూములు, సాగు చేసే పంటలు, లబ్ధి పొందే రైతులు తదితర వివరాలు సేకరించి నివేదికలు రూపొందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారులకు ఇప్పటికే పథకం అమలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోనూ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం, తదితర విషయాలను ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనం మేరకు ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 1,37,808 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్‌కు సంబంధించిన సాగు అంచనాలు రూపొందించింది. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4,55,033 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 3,42,000 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 4,52,348 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 3,40,000 ఎకరాల్లో పత్తి, 59,212 ఎకరాల్లో వరి, 38,239 ఎకరాల్లో కంది, 6089 ఎకరాల్లో సోయాబీన్, 1700 ఎకరాల్లో పెసర, 680 ఎకరాల్లో జొన్న, 742 ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు సాగు చేయనున్నారు. జిల్లాలో ఏటా పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ వరదలతో రైతులు నష్టపోతున్నారు. ఏడేళ్లుగా బీమా పథకం అమలు కాకపోవడంతో వీరికి ఎలాంటి పరిహారం అందడం లేదు. పంటలు నష్టపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తే జిల్లాలో దాదాపు 1.37 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
పకడ్బందీగా అమలు
గతంలో పంటల బీమా అమలు చేసినా ప్రీమియం చెల్లించాల్సి రావడంతో చాలా మంది అన్నదాతలు ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ సర్కారు ఏడేళ్ల తర్వాత పథకాన్ని అమలు చేయాలని యోచిస్తుండగా.. క్షేత్రస్థాయిలో అవాంతరాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పరిహారం బాధితులకు సకాలంలో అందేవిధంగా పథకం పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. క్లస్టర్ల వారీగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రాప్ బుకింగ్ వివరాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే కొన్ని చోట్ల విస్తరణ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంటల బీమాను పకడ్బందీగా అమలు చేసేందుకు రైతుల బయోమెట్రిక్ తీసుకోవడంతోపాటు వారి నుంచి డిక్లరేషన్ కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా పంటల సాగు అంచనాలు, ప్రీమియం చెల్లింపులకు అవసరమయ్యే నిధులు, రైతులు తదితర ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పథకం అమలుపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.