‘ఈ ప్రాంతమంతా గంగన్నలు, గంగవ్వలే ఉంటరు. గోదావరి అంటేనే గంగమ్మ కాబట్టి ఇక్కడి ప్రాంతమంతా గంగమ్మ పేర్లే పెట్టుకుంటరు. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉండే గంగమ్మలు, గంగయ్యలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు..’ అంటూ సోన్ మండలం పాత పోచంపాడ్ శివారులో నిర్వహించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కేటీఆర్ పేర్కొన్నారు. గంగమ్మ ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. సముద్రంలా కనిపిస్తున్న ఎస్సారెస్పీ గోదావరిని చూస్తుంటే సంబురమైందని పేర్కొన్నారు.
ఇంద్రన్న ఏం తింటున్నవే..
‘ఇంద్రకరణ్‌రెడ్డన్న మొన్న కడెం ప్రాజెక్ట్ ఎక్కడ కొట్టుకుపోతుందోనని బాధతో పోయి గేట్లు ఎత్తించిండు. నాకు 47ఏండ్లు, నాకు ఉల్టా అంటే.. ఇంద్రన్నకు 74ఏండ్లు. అయినా నాకంటే ముందే ఉరుకుతున్నడు. అన్నం ఏం తింటున్నవే.. ఏం ఎక్సర్‌సైజులు చేస్తున్నవే అని అడుగుతున్న..’ అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురించి కేటీఆర్ అనడం సభికులను ఆకట్టుకుంది. ‘ప్రజల కోసం పనిచేస్తున్నాన్న తృప్తి తనను నడిపిస్తోంది’ అని ఇంద్రకరణన్న చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖరా(కె) ప్రజలు పైసలిస్తమన్నరు
‘సార్.. మీహయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, రైతులు, అన్నివర్గాల ప్రజలు బాగున్నారని చెబుతూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని ముఖరా(కె) గ్రామ ప్రజలు సీఎం కేసీఆర్‌కు, నాకు ఎన్నికల్లో నామినేషన్ల ఖర్చుకు పైసలిస్తమన్నారు. ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందింది. ఆ ఊరి సర్పంచ్ మీనాక్షి గాడ్గే, ఊరిపెద్దలు మాకు నామినేషన్లకు డబ్బులు మేమిస్తామనడం చాలా సంతోషమేసిందని కేటీఆర్ గుర్తుచేశారు.
మీవోళ్లు.. మంచోళ్లు..
‘మీ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలూ చాలా మంచోళ్లు, సల్లటి మనుషులు. మా ప్రజలు బాగుండాలని కోరుకునేటోళ్లు. ఇలాంటి ఇంద్రకరణన్న, విఠల్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలె. అలాగే నా మిత్రుడు జాన్సన్‌నాయక్‌ను ఖానాపూర్ ప్రజలు గెలిపించాలె. జాన్సన్ గెలిచిన తర్వాత.. నిర్మల్‌తో అభివృద్ధిలో పోటీ పడాలి..’ అని మంత్రి కేటీఆర్ అనడంతో సభికులు భారీగా స్పందించారు.