
ఓదార్చుతూ..
● తొమ్మిదోరోజుకు భట్టి పాదయాత్ర ● ధనోరా నుంచి అడకు పీపుల్స్ మార్చ్ ● అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు ● వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమన్న సీఎల్పీ నేత ● సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ
సరస్వతిని
ఓదార్చుతున్న భట్టి విక్రమార్క
క్యాన్సర్‌తో గ్రూప్‌వన్ పరీక్ష రాయిస్తే..
తనకు క్యాన్సర్ ఉన్నప్పటికీ కుట్టుమిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో కొడుకును డిగ్రీ చదివించి గ్రూప్ వన్ పరీక్షలు రాయించానని గోయగాంకు చెందిన ఎస్.సరస్వతి కన్నీటి పర్యంతమైంది. ఇపుడు పేపర్ లీక్ అయిందని రాసిన పరీక్షను రద్దు చేశారని వాపోయింది. దీంతో భట్టి ఆమెను ఓదార్చారు. ప్రజా సమస్యలపైనే పాదయాత్ర చేపట్టానని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం పలువురు మహిళలు శిథిలమవుతున్న వారి ఇళ్లను చూపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు రాలేదని కిష్టాబాయి, మైనుబాయి, లహనుబాయి, లలిత వాపోయారు. భట్టి వారి ఇళ్లకు వెళ్లి వారిలో భరోసా నింపారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,300 చేశారని, ఎలా వండాలి.. ఏమి తి నాలని రాధాబాయి ఆవేదన వ్యక్తం చేసింది. డ్వాక్రా రుణాలకు పావలా వడ్డీ రావడం లేద ని, ఉండేందుకు ఇళ్లు లేవని, భూమి లేదని, కొడుకులకు ఉద్యోగాలు లేవుని రింగన్‌ఘాట్, పిప్రీ, అంబారావు, గూడకు చెందిన పలువురు మహిళలు భట్టితో తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన భట్టి ఏడాదిలోపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కే విశ్వప్రసాద్‌రావు, ఏఐసీసీ సభ్యులు మర్సకోల సరస్వతి, గణేశ్ రాథోడ్, నాయకులు కుసుంబ్‌రావు, సుదర్శన్, రాము, ఎల్లప్ప, కనకచరణ్, రౌఫ్ తదితరులున్నారు.
కెరమెరి(ఆసిపాబాద్): సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాథ్ సే హాథ్ జోడోయాత్రలో భాగంగా పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర తొమ్మిదోరోజుకు చేరింది. శుక్రవారం కెరమెరి మండలం ధనోరా గ్రామం నుంచి ఆసిఫాబాద్ మండలం అడ వరకు సుమారు 15 కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగింది. గ్రామగ్రామాన భట్టికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు తిలకం దిద్ది స్వాగతం పలికారు. ధనోరా నుంచి ప్రారంభమైన పాదయాత్ర శివగూడకు చేరుకోగానే మహిళలు మంగళహారుతులిచ్చి భట్టి నుదుట తిలకం దిద్దారు. ఆగుర్‌వాడకు చెందిన బాలింత మృతి చెందిన వ్యవహారంపై అధికారులు సరైన న్యాయం చేయలేకపోతున్నారని మడావి భీంరావు భట్టి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సావర్‌కెఢ గ్రామానికి చెందిన మహిళలు, గ్రామ పెద్దలు భట్టితో పాటు జిల్లా ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. మహాత్మా జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా మాలీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, సీఎం కేసీఆర్ ద్రోహం చేశారని ఆరోపించారు. పట్టాలు ధరణిలో లేకపోవడంతో రుణాలు రావడం లేదని, కడు పేదరికంలో బతుకుతున్న తమకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గోయగాం గ్రామానికి చేరుకోగా మహిళలు బ్రహ్మరథం పట్టారు. తమకు నెలలు గడుస్తున్నా వేతనాలు రావడం లేదని, కుటుంబ పోషణ భారమవుతోందని పారిశుధ్య కార్మికులు రాజు, శంకర్ భట్టి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.
ఆకట్టుకున్న కళాజాత
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆయా గ్రామాల్లో కళాజాత నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలను కళాకారులు ఆటపాటలతో అలరించారు. తెలుగు, హిందీ భాషల్లో పాడిన పాటలు, చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు పడుతున్న బాధలు, ప్రజావ్యతిరేక విధానాలు పాటల రూపంలో ప్రజలకు వివరించారు.

నృత్యం చేస్తున్న కళాకారులు