కాలగర్భంలోకి ఎన్నెస్పీ క్వార్టర్లు | - | Sakshi
Sakshi News home page

కాలగర్భంలోకి ఎన్నెస్పీ క్వార్టర్లు

May 1 2026 6:15 AM | Updated on May 1 2026 6:15 AM

● యాభై ఏళ్ల క్రితం వైరాలో నిర్మాణం ● ప్రస్తుతం చాలావరకు ఆక్రమణలో... ● ప్రజావసరాలకు స్థలం వినియోగించేలా కూల్చివేతకు నిర్ణయం

సర్వే పూర్తయింది..

● యాభై ఏళ్ల క్రితం వైరాలో నిర్మాణం ● ప్రస్తుతం చాలావరకు ఆక్రమణలో... ● ప్రజావసరాలకు స్థలం వినియోగించేలా కూల్చివేతకు నిర్ణయం

వైరా: వైరాలోని రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎన్నెస్సీ క్వార్టర్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యాన అందులో నివాసం ఉంటున్న వారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఎన్నెస్పీ కాల్వల నిర్మాణం, ఆతర్వాత సిబ్బంది అవసరాల కోసం 50 ఏళ్ల క్రితం ఇక్కట్లు 40 క్వార్టర్లు నిర్మించారు. రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో 1973వ సంవత్సరంలో ఈ క్వార్టర్ల నిర్మాణం జరిగింది. తొలినాళ్లలో లష్కర్లు, ఏఈ స్థాయి అధికారులు నివాసం ఉండేవారు. ఆపై శాఖలో సిబ్బంది తగ్గడం, అందులోనూ ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో క్వార్టర్లతో ఉపయోగం లేకుండా పోయింది.

అక్రమణలో క్వార్టర్లు

వైరాలోని ఎన్నెస్పీ క్వార్టర్లలో ప్రస్తుతం నివసిస్తున్న ఏ ఒక్కరు కూడా శాఖ ఉద్యోగులు కాకపోవడంతో గమనార్హం. గతంలో కొందరు సిబ్బందికి కేటాయించగా.. వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి నుంచి అద్దె తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదేక్రమాన మరికొందరు ఏళ్లుగా నివసిస్తున్నామని చెబుతూ జీఓ 58, 59 ప్రకారం తమకు క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేశారు. అయితే, అధికారులు ఆ దరఖాస్తులను తిరస్కరించారు. అంతేకాక క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో తొలగించేందుకు కొన్నాళ్ల క్రితం అధికారులు ప్రయత్నించగా కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇలా క్వార్టర్ల అంశం వివాదాస్పదంగా ఉంది. ఈనేపథ్యాన క్వార్టర్లను తొలగించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలనే భావనతో అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి, అందులో ఎవరు నివసిస్తున్నారు, అక్రమణకు ఎన్ని గురయ్యాయనే అంశంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు పరిశీలించి నివేదిక సిద్దం చేశారు.

మినీ స్టేడియం నిర్మాణానికి..

శిథిలావస్థలో ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్ల తొలగించి మల్టీపర్పస్‌ మినీ స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు ప్రతిపాదించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల వైరాలో పర్యటించినప్పుడు స్థానిక నాయకులు, అధికారులు ఈ ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్టేడియం నిర్మిస్తే అన్నివర్గాలకు ఉపయోగపడే అవకాశముండడంతో ఆయన ఆదేశాల మేరకు నివేదిక సిద్ధం చేసిన అధికారులు.. క్వార్టర్లను తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పది రోజుల్లోనే ప్రస్తుతం నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించి క్వార్టర్లను తొలగించే అవకాశముంది.

వైరాలోని ఎన్నెస్పీ క్వార్టర్లు ఎన్ని శిథిలావస్థకు చేరాయి, ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారనే అంశంపై సర్వే చేశాం. అంతేకాక కూల్చివేత కోసం అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశాం. త్వరలోనే కూల్చివేత పనులు చేపడుతాం. – సీ.హెచ్‌ సురేష్‌, తహసీల్దార్‌, వైరా

Advertisement
 
Advertisement
Advertisement