● రూ.లక్ష విలువైన వెండి వక్షస్థల కవచం బహూకరణ
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, విగ్రహానికి అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కాగా, ఏపీలోని మైలవరం మండలం ముర్సుమల్లి గ్రామానికి చెందిన శ్రీధర రామారావు, ఆయన సోదరులు రూ.లక్ష విలువ చేసే వెండి వక్షస్థల కవచాన్ని శ్రీపద్మావతి అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పందిళ్లపల్లి రేక్
పాయింట్‌కు యూరియా
చింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఇఫ్‌కో కంపెనీకి చెందిన 2,670.84 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం చేరింది. ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,070.84 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించినట్లు టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ తెలిపారు.
నేడు హెచ్‌పీవీ టీకాలు
ఖమ్మంవైద్యవిబాగం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆరోగ్య మహిళా విభాగంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభిస్తారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 14 ఏళ్లు పూర్తి చేసుకుని, 15 సంవత్సరాల లోపు గల 11,460 మంది బాలికలు ఈ కార్యక్రమానికి అర్హులని వెల్లడించారు. వారికిచ్చే ఒకే మోతాదు హెచ్‌పీవీ టీకా గర్భాశయ ముఖ కేన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. బాలికలు టీకా తీసుకునే ముందు అల్పాహారం లేదా భోజనం చేసి తల్లిదండ్రులతో కలిసి రావాలని సూచించారు. టీకా తీసుకున్న బాలికల ఎడమ చేతి చూపుడు వేలిపై గుర్తు పెట్టి, ప్రత్యేక ఽధ్రువపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఈ టీకా కార్యక్రమం జిల్లాలోని వైరా, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి సీహెచ్‌సీల్లో అమలు చేస్తున్నామని వివవరించారు.
ఆరుతడి పంటలపై
దృష్టి పెట్టాలి
వైరా: రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు సూచించారు. శనివారం వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సమగ్ర వ్యవసాయ పరిశోధనా సమాఖ్య, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం బాధ్యులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై శిక్షణ నిర్వహించారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి, ఐఎఫ్‌ఎస్ యూనిట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎండీ లతీఫ్‌పాషా, పంటల వైవిధ్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై వివరించారు. వ్యవసాయ పరిశోధనా స్థానం మధిర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి పప్పు దినుసుల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు వివరించారు. శాస్త్రవేత్తలు శ్రీధర్, డాక్టర్ నాగస్వాతి, డాక్టర్ పావని, డాక్టర్ చైతన్య, ఫణిశ్రీ పాల్గొన్నారు.


